Monday, August 15, 2011

నిరాహార దీక్షలు సమస్య పరిష్కార మార్గాలు కావు.

        తమ సమస్యల పరిష్కారంకొరకు వ్యక్తులు కాని, సంస్థల ప్రతినిధులు కాని పోరాటమార్గంలో భాగంగా నిరాహార దీక్షలు చేయడం మనకు కొత్త కాదు. కాని అవి న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు అయితే బాగానే ఉండవచ్చు, కాని న్యాయ సమ్మతం కాని వాటిని ఎన్నుకొని వాటిని సాధించేందుకు నిరాహార దీక్షలు చేయడాన్ని అందరూ ఖండించవలసి యుంటుంది. అటువంటి కొన్ని ఉదాహరణలుః

        బ్రిటిష్ ప్రభుత్వం, భారతదేశంలో స్వపరిపాలన సంబంధించిన చర్చలకోసం 1930లో ఒకటి, 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటుచేసింది. మొదటి సమావేశానికి కాంగ్రెస్ హజరుకాలేదు. మొదటి సమావేశంలోనే దళితుల హక్కులకోసం వారి ప్రతినిధులు ఒక పత్రాన్ని సమర్పించారు. ‘అస్ప్రుశ్యులకు  ప్రత్యేక నియోజకవర్గాలు’ ఆ పత్రంలో ప్రధాన డిమాండ్. బ్రిటిష్ ప్రభుత్వం ‘కమ్యూనల్ ఆవార్డ్ ’ పేరుతో అస్ప్రుశ్యుల హక్కులకూ, మైనారిటీల హక్కులకు కూడా హామీఇచ్చింది.  2వ రౌండ్ టేబుల్ సమావేశాలలో గాంధీజీ  కమ్యూనల్ ఆవార్డ్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. తనవాదనలు ఎన్నివిధాల వినిపించినా అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. తదుపరి గాంధీజీ ఇండియా తిరిగి వచ్చారు.  బొంబాయిలో దిగగానే అక్కడ లండన్లో చేసింది ఏమీలేకపోయినా గాంధీజీకి ఘన స్వాగతం లభించింది. అదే సందర్భంలో వేలాది మంది దళితులు గాంధీజీ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసారు. పోలీసుల లాఠీ చార్జిలో దాదాపు 40 మంది మరణించారు, చాలా మంది గాయపడినారు. ఈ సంఘఠన గాంధీజీపట్ల దళితుల వ్యతిరేకతను తెలియజేస్తుంది. కాని ఆ విశయాన్ని గాంధీజీ ఒప్పుకోడు. పైగా  దేశంలో ని దళితులందరూ తను చెప్పినట్లే వింటారని వాదిస్తారు. తన వాదనను రుజువు చేసుకోవడానికి గాంధీజీ దళితులను ఏకం చేసి పోరాడే కార్యక్రమం ఏదీ చేయలేదు. కాని ఎరవాడ జైళ్ళో తన వాదననే నెగ్గాలని నిరాహార దీక్షకు దిగుతారు. దేశంలేని దళితులంతా తన వాదననేబలపరిస్తే వారు అందుకు సరిఅయిన పోరాటం చేయాలి కాని నిరాహార దీక్ష చేయకూడదు. గాంధీ నిరాహారదీక్షతో సీను మారింది. నిరాహారదీక్షతో  దేశప్రజలందరిలో దళితుల పట్ల, అంబేద్కర్ పట్ల వ్యతిరేకతను సంపాదించి ఆఖరుకు అంబేద్కరును ఒప్పించడం జరిగింది. అంబేద్కర్ అయిష్టంగా అయినా ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయింది. కాని దళితులు ఆరోజే దగాచేయబడినారు. కమ్యూనల్ ఆవార్డు ద్వారా పొందగలిగే న్యాయాన్ని శాశ్వతంగా కోల్పోయారు.  గాంధీజీ చచ్చిపోతే తనను ప్రజలందరు ద్రోహిగా చూస్తారని అంబేద్కర్ ఒప్పుకోవడంతో దళితులకు అన్యాయం జరిగింది. గాంధీజీ నిరాహార దీక్ష దళితులకు శాశ్వత అన్యాయాన్నే ఒనగూర్చింది.

        2009 నవంబర్ 28నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో కె. చంద్రశేఖర్ రావు గారు నిరాహార దీక్షకు దిగారు. ఈ నిరాహార దీక్షకు ముందు దాదాపు నెలరోజుల ప్రచారంతో తెలంగాణ ప్రాంత ప్రజలలో అభిప్రాయాలు మారిపోయాయి. అంతకు ముందు తెలంగాణలో సగానికిపైగా ప్రజలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపట్ల సదభిప్రాయంలేదు. అంటే గత 50 సంవత్సరాల కాలంగా ఉన్న డిమాండ్ మైనారిటీ ప్రజల డిమాండే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ప్రయోజనంలేదు. కాని కెసిఆర్ నిరాహార దీక్షతో వారం రోజులలో పరిస్థతి తారుమారు అయింది. అప్పటిదాకా కెసిఆర్ ని అనుసరించని వారు అందరూ ఆయనబాట పట్టారు. దాంతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేసింది. ఆ వెంటనే జరిగిన వాస్తవ విషయాల ఆధారంగా మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. ఇక్కడ జరిగింది కూడా కేసిఆర్ చచ్చిపోతారనే భయంతో ప్రజాఅభిప్రాయం మారింది తప్ప న్యాయం ఎటువైపు ఉంది అని మారింది కాదు. ఈ విధంగా నిరాహారదీక్షలతో ప్రజాభిప్రాయాల్ని మార్చడం సరిఅయిన ఉద్యమ పంథా కాదు. ఉద్యమాల ద్వారా ప్రజలను సమీకరించి పోరాడాలి గాని, నిరాహార దీక్షలతో తము అనుకున్నది సాధించాలని చేసే ప్రయత్నాలు ప్రజలకు అంతిమంగా మేలు చేయకపోగా తీరని నష్టాన్ని కలిగిస్తాయి.

        దేశంలో అవినీతిని నిర్మూలించడానికి జనలోకపాల్ బిల్లు తేవాలని అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష సరిఅయినదే అయినప్పటికీ, లోక్పాల్ బిల్లు ద్వారా భారత రాజ్యాంగ పరిధిని దాటిపోయారు అన్నా. ప్రధానిని లోకపాల్ పరిధిలోకి తీసుకురావాలని కోరడం సరిఅయినదే అయినప్పటికీ, న్యాయమూర్తులుకూడా తమ పరిధిలోనే ఉండాలనడం సరిఅయినదికాదు. మరి ఆ లోక్ పాల్ అన్యాయనికి ఒడిగడితే చేసేది ఏమిటి? ఎవరి ద్వారా ఎన్నిక కాని వ్యక్తికి సర్వాధికారాలు కోరడం సరిఅయినదికాదు. అది రాజ్యాంగానికి విరుద్దం. కాని ఆ రాజ్యాంగ వ్వతిరేక విధానాన్ని కోరుతూ ఇప్పుడు అన్నా ఆగష్టు 16, 2011నుండి నిరాహారదీక్షకు దిగడం కూడా సరిఅయినది కాదు. సర్వాధికారాలు కలిగిన ఒక కమిటీ ఎందుకో  అన్నా చెప్పరు. కాని నిరాహార దీక్ష చేస్తానంటారు ఒకవైపు.  రెండోవైపున  ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి ఎందుకు తేకూడదో ఇటు ప్రభుత్వం చెప్పదు, కాని నిరాహార దీక్షను జరగనివ్వనని అనడం సరిఅయినదికాదు. ఈ రెండు విషయాలు ఇటు అన్నా వైఖరి మరియు అటు ప్రభుత్వ వైఖరివలన ప్రజలకు ఒనగూరేదేమీలేదు. అన్నా నిరాహార దీక్ష వలన ప్రజలకు ప్రయోజనం లేకపోగా అనవసర కాలయాపన మాత్రమే. అవినీతికి అంతం కావాలనే వారు చేయాల్సింది ప్రజలను ఏకం చేసి పోరాడాలి కాని నిరాహార దీక్షతో సమస్యలు పరిష్కరించబూనడం అన్యాయానికే దారితీయవచ్చు. అదే విషయాన్ని పైరెండు ఉదాహరణలలో చూసాము. 

        కాబట్టి, సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గాలు కాని, నిరాహార దీక్షలు కావు. నిరాహార దీక్షలు చేసేవారు ఎంత గొప్ప వారు అయినప్పటికీ, పోరాట మార్గాన్ని వదిలి నిరాహార దీక్ష మార్గాన్ని సూచించే వారిని ప్రజలు నమ్మకూడదు.



No comments:

Post a Comment